ఏక్ దం న్యూస్ / ఇల్లంతకుంట జులై 24:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన వోల్లాల నరసయ్య–అంజవ్వ దంపతుల ఇంట్లో పండుగ సందర్భంగా అప్పాలు తయారు చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న కుటుంబ సభ్యులు మండుతున్న సిలిండర్‌ను వెంటనే ఇంటి బయటకు తీసుకువచ్చారు. దుప్పటి కప్పి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కొంతసేపటి ఉత్కంఠ అనంతరం మంటలు అదుపులోకి రావడంతో భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ వోల్లాల రజిత వెంకటేశం వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి సమాచారం అందించి వారిని అక్కడికి రప్పించి సిలిండర్‌ను పూర్తిగా సురక్షిత స్థితికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు.