ఏక్ దం న్యూస్, కరీంనగర్ :
విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సాన్వి జూనియర్ కాలేజ్ & డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం కొత్తపల్లి రోడ్‌లోని రేకుర్తి స్వాగత్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘సాన్వి నవోత్సవం-2026’ సాంస్కృతిక వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో తీర్చిదిద్దుతున్న సాన్వి జూనియర్ కాలేజ్ & డిఫెన్స్ అకాడమీ కృషిని అభినందించారు. లయన్స్ క్లబ్ నాయకుడు లయన్ మధుసూదన్ రెడ్డి, సామాజిక సేవకుడు నాగేశ్వర్, పచ్చునూరి సురేందర్, ట్రెడిషనల్ యోగా గురువు మెహర్ కుశల్, పోలీస్ సంఘం అధ్యక్షుడు మామిడాల సురేందర్ మాట్లాడుతూ, విద్యతో పాటు సేవాభావం, వ్యక్తిత్వ వికాసం, యోగా, క్రమశిక్షణ, చట్టాల పట్ల గౌరవం వంటి విలువలు విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ అరంశెట్టి మునీందర్ మాట్లాడుతూ, పరీక్షల్లో విజయమే కాదు.. దేశానికి సేవ చేసే బాధ్యతగల పౌరులను తీర్చిదిద్దడమే సంస్థ లక్ష్యమని అన్నారు. కమ్ టు లర్న్.. గో టు సర్వ్.. సిద్ధాంతంతో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నవోత్సవం వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే వేదికలని పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, గుంటుపల్లి స్వామి, వంశీధర్ రెడ్డి, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.