ఏక్ దం న్యూస్, కోటపల్లి :
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సిర్సా గ్రామంలో పంటను ధ్వంసం చేసి బలహీన రైతు దాగామ లచ్చన్నపై జరిగిన దౌర్జన్య ఘటనపై మోకా విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారులను బాపురెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి, అతని అనుచరులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణలో వినిపించిన వాదనలు, వాటికి ఆధారాలు లేకపోవడం, మోకా పంచనామ వద్ద జరిగిన పరిణామాలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. గ్రామస్తుడు, కాంగ్రెస్ నేత జనగామ తిరుమతి మాట్లాడుతూ, అన్నల భయంతో అప్పట్లో వదిలేశాం.. ఇప్పుడు దున్నుకుంటాం అంటూ, భూమిని కొనుగోలు చేసి 35 సంవత్సరాలుగా కాస్తులో ఉన్న బలహీన రైతు దాగామ లచ్చన్నను భూమి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. మంగలి రామయ్య విక్రయించిన భూమిని దాగామ పోచయ్య కొనుగోలు చేసిన తర్వాత, అదే భూమిని బాపురెడ్డికి వదిలేయాలని అన్నలు చెబితే వదిలిపెట్టానని బాపురెడ్డి వర్గం చెప్పడం ఏమిటో అంతా అయోమయంగా ఉందన్నారు. అన్నల పేరు ప్రస్తావిస్తూ బాపురెడ్డి అనుచరులు కల్లబొల్లి మాటలతో కొత్త కథలు అల్లుతున్నారన్నారు. అన్నలు చెప్పారనే వాదనను బాపురెడ్డి వర్గం వినిపించడంతో ఈ భూమితో బాపురెడ్డికి ఉన్న సంబంధమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భూమితో మీకున్న సంబంధం ఏమిటి?.. మీకా పట్టా ఎలా వచ్చింది? అని రెవెన్యూ అధికారులు ప్రశ్నించగా, సరైన సమాధానం గానీ, స్పష్టమైన ఆధారాలు గానీ చూపలేకపోయినట్లు సమాచారం. మోకా పంచనామలో తమ బంధువులు ఇచ్చే స్టేట్‌మెంట్‌లనే నమోదు చేయాలని బాపురెడ్డి అనుచరులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన గ్రామ సర్పంచ్ భర్తపై వారు దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మోకా పంచనామను వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో అడిగేవారు లేకుంటే ఆధిపత్య కులాలదే రాజ్యం అనే విమర్శలు గ్రామంలో వినిపిస్తున్నాయి. శ్రీశ్రీ పేర్కొన్న ‘బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించిరి.. నరహంతులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి’ అనే పంక్తులను గుర్తు చేస్తూ, బాపురెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి, అతని అనుచరుల దౌర్జన్యపూరిత వైఖరి నేటి పరిస్థితులకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోందని తిరుపతి వ్యాఖ్యానిస్తున్నారు.