ఏక్ దం న్యూస్, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో :
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఇరిగేషన్ డివిజన్-6 పరిధిలోని సబ్-డివిజన్ నెం.1 కార్యాలయంలో అప్రమత్తత శూన్యమైంది. ప్రభుత్వ శాఖలకు గుండెకాయలాంటి మెజర్‌మెంట్ బుక్స్ (ఎంబీ రికార్డ్స్), సాంకేతిక దస్త్రాలను ఏమాత్రం భద్రత లేని, శిథిలావస్థకు చేరిన గదిలో భద్రపరచడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎనిమిది దశాబ్దాల పాటు కంటికి రెప్పలా కాపాడాల్సిన ఈ రికార్డులు ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాయి? వాటి భద్రతపై ఎవరి బాధ్యత? పర్యవేక్షణ ఎక్కడ విఫలమైంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇరిగేషన్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
🔶 కొలతలకు ప్రాణం.. నిర్లక్ష్యానికి బలేనా?
ఇరిగేషన్ శాఖలో ఎంబీ బుక్స్ సాధారణ కాగితాలు కావు. ప్రభుత్వ నిర్మాణ పనులు, వాటి కొలతలు, కాంట్రాక్టర్లకు చెల్లించే కోట్ల రూపాయల బిల్లుల ప్రక్రియకు ఇవే ఏకైక ప్రాథమిక ఆధారాలు. ఆడిట్, విజిలెన్స్ దర్యాప్తులు, కోర్టు విచారణలు ఏవైనా సరే ఈ రికార్డుల చుట్టూనే తిరుగుతాయి. అలాంటి అత్యంత కీలకమైన పత్రాలను కనీస తలుపులు, కిటికీలు కూడా సరిగా లేని గదిలో భద్రపరచడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. బాధ్యతాయుతమైన సాంకేతిక అధికారులు ఉన్నప్పటికీ ఈ దుస్థితి నెలకొనడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🔶 భద్రతా లోపాల పరంపర
కార్యాలయ భవనాన్ని పరిశీలిస్తేనే రికార్డుల సంరక్షణ పట్ల ఎంతటి నిర్లక్ష్యం చోటుచేసుకుందో స్పష్టంగా కనిపిస్తోంది. మూడు వైపులా మాత్రమే ప్రహరీ గోడ ఉండగా, వెనుక భాగం పూర్తిగా తెరిచి ఉంది. తలుపులు, కిటికీలు ధ్వంసమై కాలం చెల్లిన స్థితిలో దర్శనమిస్తున్నాయి. ఆధునిక కాలంలో సాధారణ కార్యాలయాల్లో ఉండే సీసీ కెమెరాల నిఘా కూడా ఇక్కడ కనిపించదు. ఇలాంటి బహిరంగ, భద్రతలేని వాతావరణంలో కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులు ఉండడం సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది. రికార్డులు దెబ్బతిన్నా, చోరీకి గురైనా, భవిష్యత్తులో వాటి ప్రామాణికతపై ప్రశ్నలు తలెత్తినా బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది.
🔶 గత చేదు అనుభవాల నీడలో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, భద్రతపై తలెత్తిన వివాదాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితులు చర్చకు వచ్చిన ఉమ్మడి జిల్లాలోనే, ఇప్పుడు సుల్తానాబాద్ సబ్-డివిజన్‌లో అత్యంత కీలకమైన ఎంబీ రికార్డులు ఇలాంటి నిర్లక్ష్య పరిస్థితుల్లో కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పారదర్శకతకు మారుపేరుగా ఉండాల్సిన ప్రభుత్వ శాఖలోనే రికార్డుల భద్రత ప్రశ్నార్థకంగా మారడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ప్రకృతి వైపరీత్యాల వల్ల గానీ, అసాంఘిక శక్తుల దొంగతనాల వల్ల గానీ ఈ రికార్డులు దెబ్బతింటే, కోట్ల రూపాయల ప్రభుత్వ పనులకు సంబంధించిన అధికారిక ఆధారాలే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంటుంది. ప్రజాధనంతో చేపట్టిన పనులకు అధికారిక సాక్ష్యాలైన రికార్డుల భద్రతలో నిర్లక్ష్యం పరిపాలనా వైఫల్యమా? లేక పర్యవేక్షణలో లోపమా? అన్నది ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రత్యేక తనిఖీ నిర్వహించి, ఈ రికార్డులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా? లేక ఇదీ మరో నిర్లక్ష్య ఘటనగానే మిగిలిపోతుందా? అన్న చర్చ ఇప్పుడు స్థానికంగా జోరందుకుంది.