ఒక కుంట.. రెండు సర్వే నంబర్లు.. అదనంగా 9 గుంటల ఎంట్రీ.. మత్తడి ఆక్రమణ.. బఫర్ జోన్‌లో నాలా కన్వర్షన్.. మట్టి డంపులు.. ఒక్కో అంశం వెలుగులోకి వస్తుండగా బాల్‌సాని కుంట వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది.

ఏక్ దం న్యూస్, మనకొండూర్ :
మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ పరిధిలోని బాల్‌సాని కుంట వ్యవహారం రోజుకో సంచలనాన్ని బయటపెడుతోంది. ఏక్ దం న్యూస్ కథనంతో భూ రికార్డుల్లో వ్యత్యాసాలు, మత్తడి ఆక్రమణ, బఫర్ జోన్‌లో నాలా కన్వర్షన్, మట్టి డంపింగ్, అనుమతుల ప్రక్రియపై సంబంధిత శాఖలు సమగ్ర క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో అత్యంత కీలకంగా మారింది సర్వే నంబర్-177. అధికారిక రికార్డుల ప్రకారం 30 గుంటలు మాత్రమే ఉండాల్సిన ఈ భూమికి అదనంగా మరో 9 గుంటలు నమోదు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అదనపు ఎంట్రీ ఎలా నమోదైంది? ఎవరి ఆదేశాలతో నమోదైంది? అనే అంశాలపై విచారణ జరగనుంది? అంతేకాదు, సాగు జరగని భూమికి రైతుబంధు అందినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించడం మరో సంచలనంగా మారింది. అసలు సాగు లేని భూమికి ఆర్థిక సాయం ఎలా విడుదలైంది? భూ రికార్డుల ఆధారంగానే జరిగిందా? లేక వ్యవస్థాపరమైన లోపమా? అన్న కోణంలోనూ పరిశీలన కొనసాగనుంది. ఇదే సమయంలో బఫర్ జోన్‌లో భారీగా మట్టి పోయడం, కుంట మత్తడిలో జోక్యం జరిగిందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిస్థితుల్లో సుడా అనుమతి లేకుండానే సర్వే నంబర్–176లో పెట్రోల్ బంక్ నిర్మాణం జరిగిందా? అనే అంశంపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో కీలక ప్రశ్న ఏమిటంటే.. కుంట మత్తడి, బఫర్ జోన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్లు 176, 177లకు నాలా కన్వర్షన్ ఎలా జరిగింది? నీటి వనరుల పరిరక్షణ నిబంధనలను పరిగణనలోకి తీసుకోలేదా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై పట్టాదారు నూనె లక్ష్మయ్య స్పందిస్తూ, ఆక్రమణలు గతంలోనే జరిగాయని, ప్రస్తుతం జరుగుతున్న మట్టి డంపింగ్‌ను లీజు తీసుకున్న డీబీఎల్ సంస్థ చేపడుతోందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఈ అంశాలపై సంబంధిత శాఖలు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ఏక్ దం న్యూస్ కథనం అనంతరం అధికారులు కదిలిన నేపథ్యంలో, బాల్‌సాని కుంట వ్యవహారంలో వాస్తవాలు వెలికితీసి, ఆక్రమణలు నిర్ధారణ అయితే వెంటనే తొలగించడం, భూ రికార్డుల్లోని అక్రమ అదనపు ఎంట్రీలను రద్దు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన నాలా కన్వర్షన్, నిర్మాణ అనుమతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది.