నాలుగు దశాబ్దాలుగా నమ్ముకున్న భూమిని కాపాడుకునేందుకు ఓ పేద రైతు పడుతున్న ఆవేదన ఇది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సాలో వెలుగు చూసిన ఈ భూ వివాదం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. దశాబ్దాలుగా చెమటోడ్చి పంట పండిస్తున్నది ఒకరైతే, గుట్టు చప్పుడ కాకుండా పట్టాలు మార్చుకుంది వేరొకరు. ఈ వ్యవహారంలో అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? రైతుల మాటల్లో...

ఏక్ దం న్యూస్, కోటపల్లి :
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో సర్వే నంబర్ 117లోని రెండు ఎకరాల సాగుభూమి వివాదంలో పేద రైతు దాగామ లచ్చన్నకు పూర్తి అండగా నిలుస్తామని గ్రామ ఉపసర్పంచ్ పెద్దింటి పున్నం చందు స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆ భూమిని లచ్చన్న కుటుంబమే సాగు చేస్తోందని, బాపురెడ్డి అనుచరులతో కలిసి వచ్చి పంటను ధ్వంసం చేయడం దుర్మార్గమని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. మంగళి ఎర్ర పోచయ్య కాలం నుంచి ఈ భూమిని లచ్చన్న కుటుంబం నమ్ముకుని జీవిస్తోందని, గత 35 నుంచి 40 ఏళ్లలో బాపు రెడ్డి ఎప్పుడూ అక్కడ వ్యవసాయం చేయలేదని పున్నం చందు తెలిపారు. ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేసి అప్పులపాలైన లచ్చన్న.. ఈ ఏడాది కష్టపడి పంట వేస్తే దౌర్జన్యంగా నాశనం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన గ్రామ పాలకవర్గం బాధితుడికి మద్దతుగా నిలిచి పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. అధికారులు నిర్వహించిన పంచనామా తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిహద్దు పట్టాదారులు హాజరు కాకపోతే, సరిహద్దు రైతులు, కౌలు రైతుల నిజమైన సాక్ష్యాలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పట్టాదారుల్లో బాపురెడ్డి బంధువులు ఉన్నట్లు తెలిపారు. భూమి ఎవరిదో తేలాలంటే గ్రామంలో ఇంటింటికీ తిరిగి, చుట్టుపక్కల రైతులు, స్థానిక ప్రజల నుంచి సమగ్ర సమాచారం సేకరించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దమనసుతో స్వయంగా జోక్యం చేసుకోవాలని పున్నం చందు విజ్ఞప్తి చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా సమగ్ర విచారణ జరిపించి, నిరుపేద రైతు లచ్చన్నకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, పేదలకు అన్యాయం జరిగితే గ్రామ పాలకవర్గంగా తాము ఎప్పుడూ సహించబోమని స్పష్టం చేశారు.