ఏక్ దం న్యూస్/ఇల్లంతకుంట జూలై 19 :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జీపురం గ్రామంలో వంశీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో, గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డా. నేరెళ్ల వంశీధర్ గౌడ్ (ఎండీ), డా. చేపూరి కపిల్ సాయి గౌడ్ (ఈఎన్‌టీ) సుమారు 300 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఆరోగ్యంపై వైద్యులు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొంటూ వంశీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. డా. నేరెళ్ల వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ, తన అమ్మమ్మ స్వగ్రామమైన వెల్జీపురంలో సేవలు అందించడం ఆనందంగా ఉందని, కార్యక్రమం విజయవంతానికి సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.